Srimad Valmiki Ramayanam

Balakanda

Chapter 7 ...Ministers of the King Dasaratha !!

With Sanskrit text in Devanagari , Telugu and Kannada

తస్య అమాత్యా గుణైరాసన్ ఇక్ష్వకోsస్తు మహాత్మనః |
మంత్రజ్ఞాశ్చ ఇంగితజ్ఞాశ్చ నిత్య ప్రియహితే రతః ||

బాలకాండ
ఏడవ సర్గ

ఆ మహాత్ముడైన ఇక్ష్వాకు మహారాజుయొక్క మంత్రులు కార్య విచారణలో దక్షులు , ఇంగితజ్ఞానమున్నవారు , గుణవంతులు , నిత్యము ప్రియముగూర్చువారు. ఆ యశోవంతుడైన రాజుకి ఎనిమిది మంత్రులుగలరు. వారు వీరులు , సద్గుణవంతులు , రాజుపై అనురక్తి గలవారు . ఎల్లప్పుడు రాజకృత్యములలో ఎట్టి తప్పులు రానివ్వనివారు .

ధృష్టి , జయంతుడు , విజయుడు, సిదార్థుడు, అర్థసాథకుడు అశోకుడు, మంత్రపాలుడు సుమంత్రుడు అను వారు ఆ ఎనిమిది మంత్రులు . వశిష్టుడు వామదేవుడు అను మహర్షులు ఇద్దరూ ఆభిమానింఫబడిన ఋషులు. ఇంకనూ పురోహితులు మంత్రులూ ఉండిరి .

ఆ అమాత్యులు విద్యావంతులు , క్షమాగుణము గలవారు , కుశలులు , ఇంద్రియములను అదుపులోనుంచుకున్నవారు, శ్రీమంతులు , మహాత్ములు , శాస్త్రజ్ఞులు , అత్యంత పరాక్రమము గలవారు, కీర్తిపొందిన వారు , మాటతప్పనివారు, తేజస్సుకలవారు , ముందుచిఱునవ్వుతో మాట్లాడు వారు, కోపముతో గాని కోరికతోగాని అసత్యము పలుకని వారు , వారికి స్వరాజ్యములో గాని పరరాజ్యములో గాని తెలియనిది ఏమీ లేదు, జరిగిన జరుగబోవుచున్న విషయములు వారికి చారులద్వారా విదితమే.

వారు సమస్త వ్యవహారములందు కుశలులు , తమ మిత్రులయెడప్రవర్తనకి సంబంధించిన పరీక్షలో నెగ్గినవారు , తమ సుతులైననూ దండము ప్రాప్తించినపుడు నిష్పక్షపాతముగా వ్యవహిరించువారు. వారు కోశాగారమును నింపుటలోనూ , చతురంగబలములను సమకూర్చుటలోనూ సమర్థులు . శతృవు అయిననూ నిరపరాధి అయినచో దండించెడివారు కాదు. వారు వీరులు , అత్యంత ఉత్సాహము కలవారు, రాజశాస్త్రమును అనుసరించువారు . సాధువులను అన్ని పరిస్థుతులలోనూ రక్షించువారు.

ఆ అమాత్యులు బ్రాహ్మణులనూ క్షత్రియులనూ బాధించకుండా ధనాగారమును నింపెడివారు. అపరాధుల యొక్క అపరాధము యొక్క తారతమ్యముల బట్టి దండ విధించెడివారు.

ఆ మంత్రులందరూ ఏకగ్రీవముగా త్రికరణశుద్ధిగా వ్యవహారములను నడుపుటవలన ఆ పురమునందు గాని ఆ రాష్ట్రమునందుగాని అసత్యము పలుకువాడు లేడు. అచట దుష్టులుగాని పరులభార్యలపై మోహముగలవాడు లేడు.ఆ పురము అదేవిధముగా ఆ రాష్ట్రము అంతటనూ ప్రశాంత వాతవరణము వ్యాపించియుండెను. ఆ మంత్రులందరూ మంచి వస్త్రములను , సముచితమైన వేషములనూ ధరించియుండిరి. వారందరూ మంచి శీలముగలవారు. వారు రాజహితమునందే దృష్టిని నిలిపి జాగ్రతతో పనిచేసెడివారు, వారు పెద్దవారగు గురువులలోని మంచి గుణములను స్వీకరించెడివారు. వారు పరాక్రమములో ప్రసిద్ధులు.

ఆ అమాత్యులు తమ బుద్ధిబలముచే విజ్ఞానము కలవారని విదేసములలోకూడా విఖ్యాతిపొందినవారు. ఏప్పుడు సంధి చేయవలెను ఎప్పుడు యుద్ధము చేయవలెను అన్న తత్వజ్ఞానము తెలిసినవారు . ప్రకృతిసిద్ధముగా కలిగిన సంపదతో తృప్తిపడువారు

మంత్రాలోచనలను రహస్యముగా నుంచుటలోసమర్థులు సున్నితమైన విషయములను సూక్ష్మబుద్ధితో అలోచన చేయగలవారు. నీతి శాస్త్రమును బాగుగా తెలిసినవారు. ఎల్లప్పుడు మంచి చెప్పేడివారు. ఇట్టి సద్గుణసంపన్నులైన అమాత్యులతో గూడి ఎట్టి వ్యసనములులేని ఆ దశరథమహారాజు భూమిని పరిపాలించెను.

ఆ మహారాజు గూఢచారులద్వారా తనదేశములోనూ పరదేశములోనూగూడా అధర్మమునకు స్థానములేకుండా ధర్మము అనుసరించి ప్రజలను సంతోష పెట్టుచూ దేశమును పరిపాలించుచుండెను. మహాదాతగా సత్యసంధుడుగా మూడులోకములందు ప్రశిద్ధికెక్కినవాడై ఆ రాజు ఈ భూలోకమును పరిపాలించుచుండెను.

ఆయనతో సమానులుగాని అయనను అధిగమించగలిగిన శతృవులులేరు. సామంతరాజులు అయనకు లొంగి వుండిరి. చాలామంది మిత్రులుగా వుండిరి. ఆయన తన ప్రతాపముచే శతృవులను రూపుమాపెను. ఆ విధముగా ఇంద్రుడు దేవలోకమును పరిపాలించినటుల ఆ రాజు ఈ భూలోకమును పరిపాలించెను.

రాజుకి హితముగూర్చుటకు తగినవిథముగా మంత్రాలోచనలు చేయుటకు నియమింపబడినవారును , సమర్థులు . కుశలురు ప్రభుభక్తి పరాయణులు అగు మంత్రులతో గూడిన ఆ మహారాజు తేజోమయమైన ఉదయకాలపు సూర్యచంద్రునివలె ప్రకాశించుచుండెను.

ఇంతటితో వాల్మీకి రామాయణములో బాలకాండలో ఏడవ సర్గ సమాప్తము

ఓమ్ తత్ సత్

తై ర్మంత్రభిః మంత్రహితే నియుక్తైః
వృతోsనురక్తైః కుశలైః సమర్థైః |
స పార్థివో దీప్తి మవాస యుక్తః
తేజోమయైః గోభిరివోదితోsర్కః ||

|| om tat sat ||